- పెండింగ్ నోటీసుల పరిష్కారాన్ని మూడు రోజుల్లో పూర్తి చేయండి
- బీఎల్‌ఓ పర్యవేక్షకులకు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశం
కరీంనగర్ టౌన్, అక్టోబర్ 15 (చైతన్యగళం): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా నోటీసులపై విచారణను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా ప్రక్రియను పూర్తి చేయాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ బీఎల్‌ఓ పర్యవేక్షకులను ఆదేశించారు. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కరీంనగర్ పట్టణ, గ్రామీణ, కొత్తపల్లి మండలాల తహసీల్దార్లు, బీఎల్‌ఓ పర్యవేక్షకులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండో దశ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో నోటీసుల జారీ, వాటిపై విచారణ, ఆన్‌లైన్ నమోదు తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో నోటీసులపై విచారణను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వారీగా పెండింగ్‌లో ఉన్న నోటీసుల పరిష్కారాన్ని మూడు రోజుల్లోగా పూర్తి చేసి, సంబంధిత ధ్రువపత్రాలతో ఆన్‌లైన్ నమోదు చేయాలని స్పష్టం చేశారు.
‘నాట్ రెస్పాండింగ్’, శాశ్వతంగా వలస వెళ్లినవారు, మరణించిన ఓటర్లకు సంబంధించిన వివరాలను పర్యవేక్షకులు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించాలని సూచించారు. సంబంధిత ఆధారాలు, స్వీకరణ పత్రాలు తీసుకొని తహసీల్దార్లకు నివేదిక సమర్పించాలని తెలిపారు. ఆయా కేసుల్లో నిబంధనల ప్రకారం కారణాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్ణీత గడువు ముగిసేలోగా ఎలాంటి పెండింగ్ లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కమిషనర్ అయాజ్, ఉప కమిషనర్లు ఖాదర్ మొహియుద్దీన్, వేణుమాధవ్, తహసీల్దార్లు రాజేష్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
