Friday, October 16, 2026
Homeతెలంగాణశ్రీ ఉమా చంద్ర మౌళీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి వేడుకలు

శ్రీ ఉమా చంద్ర మౌళీశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా దుర్గాదేవి నవరాత్రి వేడుకలు

📰 Generate e-Paper Clip

  • 16న 108 చీరలతో అమ్మవారికి విశేష అలంకరణ – 108 రకాల నైవేద్యాల సమర్పణ

మహబూబాబాద్(చైతన్యగళం): మహబూబాబాద్ పట్టణంలోని శ్రీ ఉమా చంద్ర మౌళీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ దుర్గా అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 14వ తేదీ బుధవారం నాలుగో రోజు అమ్మవారికి విశేష పూజలు, చండీ యాగం, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యదర్శనం కలగడం భక్తులు తమ అదృష్టంగా భావించారు.

ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు చండీ యాగం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం భక్తులు స్వయంగా అమ్మవారికి అభిషేకాలు నిర్వహించగా, మహాచండీ అలంకరణ, నవావరణ మూలమంత్ర హోమం, పూర్ణాహుతి, 18 నిమ్మకాయ ముక్కలతో సర్పదోష కుంకుమార్చన పూజలను నిర్వహించారు.

సాయంత్రం 6 గంటలకు సౌందర్యలహరి, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం దుర్గాదేవికి భక్తులచే సువాసినీ పూజలు జరిపించారు. మహిళా భక్తుల కోసం ఐదు చీరల లక్కీ డ్రాతో పాటు ఒక వెండి నాణెం లక్కీ డ్రా నిర్వహించారు. పంచహారతుల అనంతరం పవళింపు సేవ చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

అక్టోబర్ 16న అమ్మవారికి 108 చీరలతో అలంకరణ

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 16వ తేదీ శుక్రవారం మూల నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు అన్నావజ్జుల యుగంధర్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 8.30 గంటలకు అమ్మవారిని 108 చీరలతో విశేషంగా అలంకరించనున్నారు.

ఈ అలంకరణలో భాగస్వాములు కావాలనుకునే భక్తులు సమర్పించే చీరపై ఒక కాగితంలో తమ ఇంటి పేరుతో సహా పూర్తి పేరు రాసి, పిన్‌తో జతచేసి ఆలయానికి అందించాలని సూచించారు.

అదేవిధంగా సాయంత్రం 5.45 గంటలకు భక్తులచే స్వయంగా శ్రీచక్రానికి 16 రకాల ద్రవ్యాలతో అభిషేకం, సంపూర్ణ శ్రీచక్ర అర్చన, లలితా సహస్రనామ కుంకుమార్చన నిర్వహించనున్నారు. రాత్రి 7.15 గంటలకు శ్రీ దుర్గా అమ్మవారికి, శ్రీచక్రానికి భక్తులచే 11 రకాల పుష్పాలతో పుష్పాభిషేకం చేయనున్నారు. రాత్రి 8 గంటలకు 108 రకాల నైవేద్యాలను అమ్మవారికి సమర్పించనున్నారు.

ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనదలచిన భక్తులు రూ.100 చెల్లించి పూజలో భాగస్వాములు కావచ్చని అర్చకులు తెలిపారు. అమ్మవారి కృపకు పాత్రులు కావాలని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ అర్చకులు కోరారు.

ఆలయ ఈవో ఎన్. సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ కె. వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!