- సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం
ఎల్కతుర్తి, నవంబర్ 7 (చైతన్యగళం): ఎల్కతుర్తి మండల కేంద్రంలో నూతన కోర్టు ఏర్పాటు చేయడంతో పాటు, కోర్టు నిర్వహణకు అవసరమైన 56 పోస్టులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై మండల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కృతజ్ఞతా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎల్కతుర్తి మండల కేంద్రంలో నూతన కోర్టు ఏర్పాటు కావడం మండల ప్రజల చిరకాల స్వప్నమని అన్నారు. ఈ నిర్ణయంతో ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయని తెలిపారు. కోర్టు నిర్వహణకు అవసరమైన 56 పోస్టులకు కేబినెట్ ఆమోదం లభించడం సంతోషకరమన్నారు.
మండల ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా నూతన కోర్టు మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ప్రత్యేక చొరవ చూపిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఎల్కతుర్తి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం మండల అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని, సామాన్య ప్రజలకు న్యాయ సేవలు సులభంగా, వేగంగా అందుబాటులోకి రావడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుకినే సంతాజీ, ఎల్కతుర్తి సొసైటీ బ్యాంక్ చైర్మన్ ఎలిగేటి ఇంద్రసేనరెడ్డి, పీసీసీ సభ్యుడు బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ గోలి రాజేశ్వర్‌రావు, వివిధ గ్రామాల సర్పంచులు శ్రీకాంత్‌రెడ్డి, సృజన, రాజు యాదవ్, గోలిపల్లి సంపత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సొసైటీ బ్యాంక్ డైరెక్టర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు, ఎల్కతుర్తి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంబాల శ్రీకాంత్, హింగే శ్రీకాంత్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు శ్రీపతి లావణ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్‌సింగ్, బొల్లెపోగు రమేష్, శనిగరపు వెంకటేష్, మండల బీసీ విభాగం మాజీ అధ్యక్షుడు నరేష్, సీనియర్ నాయకులు గోడిశాల యాదగిరి, అర్జున్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ సామాజిక మాధ్యమాల సమన్వయకర్త అంబాల జగన్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
