Monday, November 9, 2026
Homeతెలంగాణముల్కనూరులో ఘనంగా సదర్ పండుగ ఉత్సవాలు

ముల్కనూరులో ఘనంగా సదర్ పండుగ ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

  • ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

భీమదేవరపల్లి , నవంబర్ 7 (చైతన్యగళం): హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరు గ్రామంలో దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై యాదవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, యాదవ సోదరులు తమ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా దీపావళి సందర్భంగా సదర్ ఉత్సవాలను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారని గుర్తుచేశారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నాయకులు హాజరయ్యారని పేర్కొన్నారు.

“జై యాదవ్.. జై మాధవ్” నినాదంతో యాదవ సోదరులు తమ సంప్రదాయాలను కొనసాగిస్తూ సదర్ పండుగను జరుపుకుంటారని మంత్రి తెలిపారు. వ్యవసాయంతో పాటు పాడిపంటలు, పశుసంపద కూడా సమానంగా అభివృద్ధి చెందాలనే సందేశాన్ని ఈ పండుగ చాటుతుందన్నారు. పశుసంపదకు పూజలు చేసి, దున్నపోతులను అలంకరించి గౌరవించడం సదర్ ఉత్సవాల్లో ప్రత్యేకత అని వివరించారు.

మనిషిని ఎంతగా గౌరవిస్తామో పశుసంపదను కూడా అంతే గౌరవించుకోవాలనే గొప్ప సంప్రదాయం ఈ పండుగలో ఉందని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ ఉత్సవాలు తరతరాలుగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ యాదవ సోదరులకు మరోసారి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!