- 2,500 మందికి అన్నదానం.. 140 మంది పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రదానం
మానుకోట(చైతన్యగళం): పితృపక్షాల సందర్భంగా శ్రీ వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మానుకోటలో 15 రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా సుమారు 2,500 మందికి నారాయణ సేవ పేరుతో అన్నదానం చేయడంతో పాటు, పట్టణ పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతరం శ్రమిస్తున్న 140 మంది కార్మికులకు వస్త్రదానం చేసి, భోజనం అందించారు.
సమాజసేవతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ, ఈ కార్యక్రమాల్లో ప్లాస్టిక్కు బదులుగా పర్యావరణహిత ప్లేట్లను వినియోగించారు. అలాగే నాగార్జున కాలనీలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గోవుల కోసం 75 కిలోల తవుడును అందజేసి గోసేవ నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ, పితృపక్షాల పవిత్ర సమయంలో ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, సమాజం కోసం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం, మూగజీవాల పట్ల కరుణ చూపడం తమ సేవా సంకల్పమని తెలిపారు. అన్నదానం, వస్త్రదానం వంటి కార్యక్రమాల ద్వారా సమాజంలో సేవాభావం, మానవత్వం పెంపొందించడమే తమ లక్ష్యమన్నారు.
ఈ సేవా కార్యక్రమాల విజయానికి సహకరించిన దాతలు, సేవాభిమానులు, ట్రస్ట్ సభ్యులు, పట్టణ ప్రముఖులు, శ్రేయోభిలాషులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
