- 700 మందికి పైగా దివ్యాంగులు, వృద్ధుల హాజరు
హుస్నాబాద్, నవంబర్ 26 (చైతన్యగళం): సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో, అలింకో సంస్థ సహకారంతో దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం నిర్వహించిన సహాయ ఉపకరణాల ఎంపిక శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరానికి 700 మందికి పైగా హాజరైనట్లు మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మి తెలిపారు.
శిబిరానికి వచ్చిన వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించి, వారి అవసరాలకు అనుగుణంగా సహాయ ఉపకరణాలను ఎంపిక చేస్తారని ఆమె వివరించారు. వయోవృద్ధులకు చేతికర్రలు, నడవలేని వారికి అవసరమైన నడక ఉపకరణాలు, వినికిడి లోపం ఉన్నవారికి వినికిడి యంత్రాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.
‘మానవసేవే మాధవసేవ’ అనే భావనతో మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలోని దివ్యాంగులు, వయోవృద్ధులకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని దండి లక్ష్మి తెలిపారు. శిబిరానికి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు.

