Tuesday, November 3, 2026
Homeతెలంగాణకరీంనగర్కేసీఆర్‌ చొరవతోనే మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు.. పదేళ్లలో గణనీయమైన అభివృద్ధి

కేసీఆర్‌ చొరవతోనే మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు.. పదేళ్లలో గణనీయమైన అభివృద్ధి

📰 Generate e-Paper Clip

  • గిరిజనులు, ఆదివాసీలు, పేదవర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యం
  • జిల్లా ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

మహబూబాబాద్(చైతన్యగళం): మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) చొరవతోనే మహబూబాబాద్ జిల్లా ఏర్పాటైందని, పదేళ్ల కాలంలో జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గిరిజనులు, ఆదివాసీలు, పేదవర్గాల ప్రజలకు పరిపాలనను చేరువ చేయాలనే లక్ష్యంతో కేసీఆర్‌ మహబూబాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.

మహబూబాబాద్ జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. తొలుత మహబూబాబాద్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం డీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. గతంలో మహబూబాబాద్ ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రానికి సంబంధించిన పనుల కోసం వరంగల్‌కు వెళ్లాల్సి వచ్చేదని, దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని గుర్తుచేశారు. ప్రజల కష్టాలను గుర్తించిన కేసీఆర్‌ మహబూబాబాద్‌ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజలకు చేరువ చేశారని అన్నారు. జిల్లా ఏర్పాటుతో కలెక్టరేట్‌తో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు అందుబాటులోకి వచ్చాయని, వైద్య విద్య, వైద్య సేవల అభివృద్ధికి మెడికల్‌ కాలేజీ, ఆసుపత్రి ఏర్పాటుతో ప్రజలకు ప్రయోజనం చేకూరిందని వివరించారు.

సాగునీటి రంగంలోనూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని పేర్కొంటూ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మహబూబాబాద్ ప్రాంతానికి సాగునీరు అందించే ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. జిల్లా ఏర్పాటు వల్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు అభివృద్ధి అవకాశాలు విస్తరించాయని అన్నారు.

జిల్లా ఆవిర్భావ దశాబ్ది సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు కేసీఆర్‌ పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షురాలు మాలోత్‌ కవిత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, డీఎస్‌ రెడ్యానాయక్‌, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ బిందు, బీఆర్‌ఎస్‌ నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!