- సంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినుల సందడి.. పూల పండుగతో పాఠశాలలో పండుగ శోభ
హుస్నాబాద్ , అక్టోబరు 9 (చైతన్యగళం):
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని హుస్నాబాద్ పట్టణంలోని మాంటిస్సోరి ఉన్నత పాఠశాలలో గురువారం ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. పాటలు, సందడితో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ మన్నన్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. విద్యార్థులకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడంతోపాటు ప్రకృతి పరిరక్షణ ప్రాధాన్యాన్ని తెలియజేయడంలో ఇలాంటి వేడుకలు దోహదపడతాయని తెలిపారు. పూల పండుగ విశిష్టతను విద్యార్థినులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు షాజు థామస్, కె. రవీందర్, ఏహెచ్‌ఎం సునీల కుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
