Saturday, October 10, 2026
Homeతెలంగాణకరీంనగర్వర్షాభావంపై కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

వర్షాభావంపై కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు

📰 Generate e-Paper Clip

కరీంనగర్ అక్టోబర్ 09 (చైతన్యగళం):

రాష్ట్రంలో వర్షపాతం తగ్గుతున్న నేపథ్యంలో కరువు పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, విద్యుత్, ఉపాధి హామీ పనులపై సమీక్షించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో వర్షపాతం లోటు ఉండగా, 320 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైనట్లు సీఎస్ తెలిపారు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 20 శాతం లేదా అంతకంటే ఎక్కువ లోటు ఉన్న మండలాలను గుర్తించి, పంటల పరిస్థితి, సాగు విస్తీర్ణం, భూగర్భ జలాల స్థాయిపై క్షేత్రస్థాయి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ నెల 12న ముఖ్యమంత్రి నిర్వహించనున్న సమావేశానికి అవసరమైన వివరాలను అందించాలని ఆదేశించారు.

వర్షాభావంతో వ్యవసాయ పనులు తగ్గే అవకాశం ఉన్నందున గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రతి గ్రామంలో కనీసం 60 మందికి పని కల్పించాలని తెలిపారు. చెరువుల్లో పూడికతీత, కాలువల మరమ్మతులు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి జల సంరక్షణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. రాష్ట్రంలో లక్ష్యంగా పెట్టుకున్న 50 వేల ఫార్మ్ పాండ్స్‌లో ఇప్పటికే 33 వేల నిర్మాణాలు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. బోరుబావుల రీచార్జ్ పనులను అక్టోబర్ 25లోగా పూర్తి చేయాలని తెలిపారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరత ఏర్పడకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సూచించారు. అందుబాటులో ఉన్న ఉపాధి హామీ నిధులను నిబంధనల ప్రకారం వినియోగిస్తూ నీటి సంరక్షణ, గ్రామీణ ఉపాధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి, తాగునీటి సరఫరాకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, జలసిరి కార్యక్రమం కింద నీటి సంరక్షణ పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సీపీఓ రామ్ దత్తా రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రు నాయక్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!