Tuesday, September 29, 2026
Homeతెలంగాణఆర్ఎఫ్‌సీఎల్‌ విషయంలో కేంద్రం విఫలం

ఆర్ఎఫ్‌సీఎల్‌ విషయంలో కేంద్రం విఫలం

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి, సెప్టెంబర్ 29 (చైతన్యగళం):

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్‌సీఎల్‌) నిర్వహణ, కార్యకలాపాలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ రైతులకు కీలకమైన ఎరువుల ఉత్పత్తి సంస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ‘మేక్ ఇన్ ఇండియా కాదు.. ఫేక్ ఇన్ ఇండియా’గా మారిందంటూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతూ బీఎస్‌ఎన్‌ఎల్, ఇస్రో, డీఆర్‌డీఓతో పాటు తన నియోజకవర్గంలోని ఆర్ఎఫ్‌సీఎల్‌ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపాలకు గురవుతోందని పేర్కొన్నారు. ఆర్ఎఫ్‌సీఎల్‌ సంక్షోభంలో ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో సుమారు రూ.10 వేల కోట్ల రుణభారం మాఫీకి చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, కాకా వెంకటస్వామి, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వంటి నాయకుల కృషితో రామగుండంలో ఎరువుల ఉత్పత్తి పునరుద్ధరణకు బాటలు పడ్డాయని తెలిపారు. తెలంగాణలోనే యూరియా ఉత్పత్తి జరిగి, రాష్ట్ర రైతులకు అవసరమైన ఎరువులను దేశీయంగా అందించాలనే ఆత్మనిర్భర్ భావనకు ఆర్ఎఫ్‌సీఎల్‌ ఒక ఉదాహరణగా ఉండాల్సిన సంస్థ అని ఎంపీ వంశీకృష్ణ అన్నారు. అయితే ప్రస్తుతం ప్లాంట్ కార్యకలాపాల్లో తరచూ అంతరాయాలు ఏర్పడటం రైతులకు ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. రామగుండంలోని పరిశ్రమ నిర్వహణకు సంబంధించిన కీలక నిర్ణయాలను స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోకుండా దూర ప్రాంతాల నుంచి తీసుకోవడం వల్ల నిర్వహణలో సమన్వయ లోపాలు, నిర్ణయాల్లో జాప్యం, ఉత్పత్తిపై ప్రభావం ఏర్పడుతున్నాయని ఎంపీ విమర్శించారు. తెలంగాణలో ఉన్న ఫ్యాక్టరీని తెలంగాణ అవసరాలకు అనుగుణంగా సమర్థవంతంగా నడపాలని, రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలు, రామగుండం ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి, ఆర్ఎఫ్‌సీఎల్‌ భవిష్యత్తు కోసం తాను నిరంతరం గళం విప్పుతానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. తెలంగాణ రైతుల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం తమ పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!