Sunday, October 18, 2026
Homeతెలంగాణజల సంరక్షణకు ఆదర్శ దంపతుల ముందడుగు

జల సంరక్షణకు ఆదర్శ దంపతుల ముందడుగు

📰 Generate e-Paper Clip

  • ‘జల దీక్ష–108 ఇంకుడు గుంతలు’ కార్యక్రమానికి స్పందన.. రెండు ఇంకుడు గుంతల నిర్మాణానికి రామకృష్ణ–నర్మదా దంపతుల సంకల్పం

మహబూబాబాద్, అక్టోబర్ 18 (చైతన్యగళం):

భూగర్భ జలాలను పెంపొందించి, వర్షపు నీటిని ఒడిసిపట్టాలనే లక్ష్యంతో శ్రీ వాసవి సేవా ట్రస్ట్ చేపట్టిన ‘జల దీక్ష–108 ఇంకుడు గుంతలు’ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా బొడ్ల వెంకటయ్య కుమారుడు రామకృష్ణ, కోడలు నర్మదా దంపతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రెండు ఇంకుడు గుంతలను నిర్మించాలని సంకల్పించారు.

మహబూబాబాద్‌లోని ఎస్‌ఎస్‌వీఎల్ ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఒకటి, తమ నివాసం వద్ద మరొకటి చొప్పున రెండు ఇంకుడు గుంతలను నిర్మించనున్నట్లు దంపతులు ప్రకటించారు. వర్షపు నీరు వృథాగా బయటకు వెళ్లకుండా భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాల పెరుగుదలకు తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీ వాసవి సేవా ట్రస్ట్ ప్రతినిధి గర్రెపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. పూర్వీకులు చెరువులు, బావులు నిర్మించి నీటి వనరులను భావితరాలకు అందించారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో నేటి తరం కూడా వర్షపు నీటిని సంరక్షించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద, కార్యాలయంలో, పాఠశాలలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా భూగర్భ జలాల పెరుగుదలకు తోడ్పడవచ్చని తెలిపారు.

‘ఒక్కొక్కరు ఒక్కో ఇంకుడు గుంత నిర్మించుకుంటే జల సంరక్షణ ప్రజా ఉద్యమంగా మారుతుంది’ అనే సంకల్పంతో ట్రస్ట్‌ 108 ఇంకుడు గుంతల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. రామకృష్ణ–నర్మదా దంపతులు తీసుకున్న నిర్ణయం మరింతమందికి స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు.

వర్షపు నీటిని ఒడిసిపట్టి, భావితరాలకు నీటి భద్రత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఇంకుడు గుంతల నిర్మాణానికి ముందుకు రావాలని శ్రీ వాసవి సేవా ట్రస్ట్‌ కోరింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!