- శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో బతుకమ్మలకు బహుమతుల ప్రదానం.
మహబూబాబాద్(చైతన్యగళం): జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా నిర్వహించిన వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ప్రదర్శించగా, వాటిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన బతుకమ్మలకు నిర్వాహకులు బహుమతులను అందజేశారు. పూల పండుగైన బతుకమ్మ వేడుకలు సంప్రదాయాలు, సంస్కృతి, మహిళల ఐక్యతకు ప్రతీకగా నిలిచాయి.
ఈ పోటీల్లో పట్టణంలోని ప్రముఖ వ్యాపార సంస్థ ప్రకాష్ ఎలక్ట్రికల్స్ వారు అలంకరించిన బతుకమ్మ ద్వితీయ బహుమతిని కైవసం చేసుకుంది. అందంగా పేర్చిన రంగురంగుల పూలు, ఆకర్షణీయమైన అలంకరణతో ఈ బతుకమ్మ ప్రత్యేకంగా నిలిచి అందరినీ ఆకట్టుకుంది. విజేతలకు బహుమతులు అందజేయడంతో వేడుకల్లో మరింత ఉత్సాహం నెలకొంది.

ఈ సందర్భంగా నాళ్ల వీరన్న మహేశ్వరి మాట్లాడుతూ… బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ, వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ ప్రజల మధ్య ఐక్యతను పెంపొందిస్తుందని అన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు సంప్రదాయాలను భావితరాలకు అందించడంతో పాటు సమాజంలో సోదరభావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ముఖ్య సలహాదారులు చౌడవరపు మోహన్రావు, శ్రీరంగం కిషోర్, ఇమ్మడి రవికుమార్, నాళ్ల తరుణ్, అనూష తదితరులు పాల్గొన్నారు.
