- కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ పోరిక బలరాం నాయక్ వినతి
న్యూఢిల్లీ (చైతన్యగళం):
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రైల్వే సమస్యలను పరిష్కరించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంపీ పోరిక బలరాం నాయక్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంపీ పోరిక బలరాం నాయక్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
మహబూబాబాద్‌లో వందే భారత్ మెగా నిర్వహణ కేంద్రం (POH, ROH వర్క్‌షాప్) ఏర్పాటుకు త్వరితగతిన శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ వర్క్‌షాప్ అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని వివరించారు.
మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నాలుగో ప్లాట్‌ఫామ్‌ను నిర్మించాలని కోరారు. అదేవిధంగా మహబూబాబాద్, కేసముద్రం, డోర్నకల్, నెక్కొండ, మణుగూరు రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
నియోజకవర్గ పరిధిలో రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఎంపీ కోరారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ తదితరులు పాల్గొన్నారు.
