- ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంత్రి దామోదర రాజనర్సింహ హామీ
హైదరాబాద్ (చైతన్యగళం):
రాష్ట్రవ్యాప్తంగా గత 18 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నవంబర్ 2న ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరుపుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఫోరం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కరుణాకర్ లునావత్ ఆధ్వర్యంలో ఫోరం నాయకులు హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో మంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఫోరం చైర్మన్ డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోత్ మాట్లాడుతూ.. గత 20 నుంచి 25 ఏళ్లుగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు రాష్ట్ర ప్రజారోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తూ వివిధ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ వారికి తగిన వేతనాలు, ఉద్యోగ భద్రతతోపాటు ఆర్థిక, సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఐదు శాతం వార్షిక వేతన పెంపు, ఎనిమిది శాతం విధేయత బోనస్ కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న జీవో నంబర్ 1195ను అమలు చేయడంతోపాటు పీఎఫ్ సౌకర్యం, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సాధారణ సెలవులను 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచాలని, కారుణ్య నియామకాలు, రుణ సదుపాయం, ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు.
ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఉద్యోగుల సంక్షేమ విధానాలను పరిశీలించి, తెలంగాణలోనూ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు తగిన ప్రయోజనాలు కల్పించాలని నాయకులు మంత్రిని కోరారు. ప్రైవేట్ ఉద్యోగ సంఘాల గౌరవ అధ్యక్షుడు గంధం రాములు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగ సంఘాల నాయకుల వినతిపై మంత్రి దామోదర రాజనర్సింహ సానుకూలంగా స్పందించారు. నవంబర్ 2న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా చర్చలు జరిపి సమస్యలను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఫోరం వైస్ చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు, అధ్యక్షుడు డాక్టర్ రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ సంజీవ్ నాయక్, సంయుక్త కార్యదర్శి వినోద్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
