- రాజకీయ అధికారమే సమస్త సమస్యల పరిష్కారానికి మార్గం: బీఎస్పీ నేతలు
తాండూరు, అక్టోబర్ 29 (చైతన్యగళం): దశాబ్దాలుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం కోసం పోరాడుతున్న బహుజనుల జీవితాల్లో నిజమైన మార్పు రావాలంటే రాజకీయ అధికారం సాధించడం ద్వారానే సాధ్యమని బహుజన్ సమాజ్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జి సయ్యద్ అమీర్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కట్టెల మల్లేశం అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని బీఎస్పీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కృష్ణయ్య గౌడ్ అధ్యక్షతన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొడంగల్ అసెంబ్లీ మాజీ ఇన్‌చార్జి డాక్టర్ వెంకటేశ్వర్లు మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సయ్యద్ అమీర్, కట్టెల మల్లేశం మాట్లాడుతూ.. రాజకీయ అధికారమే సమస్త సమస్యల పరిష్కారానికి మాస్టర్ కీ అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు బీఎస్పీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. బహుజనులు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోకుండా పాలనలో భాగస్వాములైనప్పుడే వారి సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతాయని పేర్కొన్నారు. రాజకీయ అధికారం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు వివక్షకు గురవుతున్న ఇతర వర్గాలకు సామాజిక హోదా, ఆత్మగౌరవం లభిస్తాయని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు బహుజన యువతకు స్వయం ఉపాధి పథకాలు కల్పించాలని, పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. పేదలు, భూమిలేని నిరుపేద బహుజనులకు సాగుభూమి, నివాస స్థలాలు పంపిణీ చేయడం ద్వారా వారి కుటుంబాలకు స్థిరమైన ఆర్థిక భద్రత కల్పించాలని అభిప్రాయపడ్డారు. అణచివేతకు గురవుతున్న వర్గాల రక్షణ కోసం అమల్లో ఉన్న చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని, దాడుల నివారణ, మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు శాంతిభద్రతలను పటిష్టం చేయాలని కోరారు.
కేవలం సంక్షేమ పథకాలు, తాత్కాలిక హామీలతో బహుజనుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావని, స్వయంపాలనతో పాటు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం లభించినప్పుడే విధాన నిర్ణయాల్లో వారి స్వరానికి ప్రాధాన్యం దక్కుతుందని నాయకులు అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన సంక్షేమ, సామాజిక కార్యక్రమాలను ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. బహుజన వర్గాలు తమ ఓటు హక్కు విలువను గుర్తించి, రాజకీయ స్వయంపాలన దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
బీఎస్పీ తాండూరు నియోజకవర్గ కమిటీ ఎన్నిక
సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ తాండూరు నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా నవీన్ యాదవ్, కృష్ణయ్య గౌడ్, అధ్యక్షుడిగా మ్యాతరి అనిల్‌కుమార్, ఉపాధ్యక్షుడిగా టిప్పర్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఎర్ర అనిల్, కార్యవర్గ సభ్యుడిగా అడికె మల్లేష్, బహుజన వాలంటీర్ ఫోర్స్ కన్వీనర్‌గా ఎం.శ్యామ్‌ను ఎన్నుకున్నారు.
