- విద్యార్థినుల హాజరు, బోధన, పౌష్టికాహారంపై ఆరా
నాగర్కర్నూల్, అక్టోబర్ 27 (చైతన్యగళం): నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని (కేజీబీవీ) జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దసరా సెలవుల అనంతరం పాఠశాలకు తిరిగి హాజరైన విద్యార్థినుల వివరాలు, విద్యాబోధన, వారికి అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి వారి వివరాలు తెలుసుకున్నారు. సెలవుల అనంతరం పాఠశాలకు హాజరైన విద్యార్థినుల సంఖ్య, హాజరు శాతంపై ఆరా తీశారు. ఉపాధ్యాయుల హాజరు వివరాలను పరిశీలించడంతో పాటు పాఠశాలలో విద్యాబోధన, నిర్వహణకు సంబంధించిన అంశాలను సమీక్షించారు.
అనంతరం విద్యార్థినులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని పరిశీలించి, భోజన నాణ్యతకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు ఆరోగ్యం, పౌష్టికాహారం, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి సూచించారు. విద్యార్థినుల క్రమబద్ధమైన హాజరు, ఉపాధ్యాయుల బాధ్యతాయుతమైన విధుల నిర్వహణతోనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.
ఈ తనిఖీలో కేజీబీవీ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

