Tuesday, October 27, 2026
Homeతెలంగాణరంగారెడ్డిఇబ్రహీంపట్నం కోర్టుకు నూతన భవనం, రహదారి సౌకర్యం కల్పిస్తాం

ఇబ్రహీంపట్నం కోర్టుకు నూతన భవనం, రహదారి సౌకర్యం కల్పిస్తాం

📰 Generate e-Paper Clip

  • న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం, అక్టోబర్‌ 27 (చైతన్యగళం): ఇబ్రహీంపట్నం కోర్టుకు నూతన భవనం నిర్మించడంతో పాటు, కోర్టుకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం కల్పించే అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. మంగళవారం ఇబ్రహీంపట్నంలో బార్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమావేశమైన ఆయన న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు.

దశాబ్దాల క్రితం నిర్మించిన ప్రస్తుత కోర్టు భవనం స్థానంలో నూతన భవన నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో న్యాయవాదులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. న్యాయవాదుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు ఆమోదం లభించిందని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు పోషించిన పాత్ర మరువలేనిదని అన్నారు.

సామ రామ్మోహన్‌రెడ్డిని గెలిపించాలి

రానున్న మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా న్యాయవాది సామ రామ్మోహన్‌రెడ్డిని బరిలో నిలిపినట్లు మల్‌రెడ్డి రంగారెడ్డి తెలిపారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామ్మోహన్‌రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే న్యాయవాదుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంటూ, ప్రభుత్వానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే తెలిపారు. ఇబ్రహీంపట్నం అభివృద్ధిలో న్యాయవాదులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వేణుగోపాల్‌రెడ్డి, న్యాయవాదులు రాములు, వెంకట్‌రెడ్డి, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!