- టాస్క్ కేంద్రం ద్వారా 2,600 మందికి ఉద్యోగ అవకాశాలు
పెద్దపల్లి, అక్టోబర్ 26 (చైతన్యగళం): యువతకు నైపుణ్య శిక్షణ అందించి మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.27 లక్షలతో పునరుద్ధరించిన అదనపు తరగతి గదులను, రూ.25 లక్షలతో ఏర్పాటు చేసిన టాస్క్ ప్రాంతీయ కేంద్రాన్ని, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో రూ.2.50 లక్షలతో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా విజయరమణ రావు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో విద్యారంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు రూ.70 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. టాస్క్ కేంద్రం ద్వారా గత ఏడాదిన్నరలో 2,600 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయని, దీనికి సంబంధించిన వివరాలతో వారం రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, పరీక్షా ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.విద్యార్థులు క్రమశిక్షణతో చదివి లక్ష్యాలను సాధించాలని, అధ్యాపకులు వారి హాజరు, ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవో, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, సింగిల్ విండో చైర్మన్, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
