- మంథని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు
మంథని, అక్టోబర్ 26 (చైతన్యగళం): విద్యార్థులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలను తెలుసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి మల్లాడి అపర్ణ సూచించారు. మంథనిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె విద్యార్థులకు పోక్సో చట్టం, బాలల హక్కులపై వివరించారు.
సురక్షిత్ బచ్చన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ సదస్సులో జడ్జి మల్లాడి అపర్ణ మాట్లాడుతూ.. బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ కల్పించేందుకు పోక్సో చట్టం అమల్లో ఉందని తెలిపారు. విద్యార్థులు తమకు ఎదురయ్యే అనుచిత ప్రవర్తనను గుర్తించి, భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. బాలల భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు గీట్ల భరత్‌రెడ్డి, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కె. రఘోత్తంరెడ్డి, శశిభూషణ్ కాచే, గౌతమి శ్రీలక్ష్మి, వ్యాస్కుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
