- ఉయ్యాల పాటలకు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్రావు
కరీంనగర్, అక్టోబర్ 16 (చైతన్యగళం): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని బొమ్మకల్లో ఏడు రోజుల సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా ముగిశాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలతో బొమ్మకల్ ప్రాంతం పండుగ శోభను సంతరించుకుంది.
ఈ వేడుకలకు కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను ఏర్పాటు చేసి, వాటి చుట్టూ చేరి భక్తిశ్రద్ధలతో గౌరమ్మను పూజించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ మహిళలతో కలిసి ఉయ్యాల పాటలకు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.
వేడుకల అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్రావులను స్థానికులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.
ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. ఆడపడుచుల ఆత్మగౌరవానికి, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఏడు రోజుల సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మహిళలు, యువతీయువకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
