Saturday, October 17, 2026
Homeతెలంగాణకరీంనగర్ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన కలెక్టర్‌ చిత్రా మిశ్రా

ఉద్యోగులతో కలిసి బతుకమ్మ ఆడిన కలెక్టర్‌ చిత్రా మిశ్రా

📰 Generate e-Paper Clip

  • ఐడీఓసీలో అంబరాన్నంటిన ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు
  • ఉద్యోగుల మధ్య ఐక్యత, ఆత్మీయతను పెంపొందించే వేడుకలు: కలెక్టర్‌

కరీంనగర్‌, అక్టోబర్ 16 (చైతన్యగళం): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని కరీంనగర్‌లోని నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో శుక్రవారం రాత్రి ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా మహిళా అధికారులు, ఉద్యోగినులతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. తెలంగాణ జానపద గీతాలు, సన్నాయి, డోలు వాయిద్యాల నడుమ ఐడీఓసీ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

కరీంనగర్‌ జిల్లా ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) చైర్మన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి, కన్వీనర్‌ మడిపల్లి కాళీచరణ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో, భాగస్వామ్య ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగుల సహకారంతో వేడుకలను ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, వాటి చుట్టూ చేరి ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సత్తుపిండి వితరణ చేపట్టారు.

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ

ఈ సందర్భంగా కలెక్టర్‌ చిత్రా మిశ్రా మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి ప్రతీక అని అన్నారు. ఇది కేవలం పూల పండుగ మాత్రమే కాదని, మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి సాంస్కృతిక వేడుకలు ఉద్యోగుల మధ్య స్నేహభావాన్ని, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని తెలిపారు.

వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు రూపొందించిన బతుకమ్మలను కలెక్టర్‌ పరిశీలించి, ఎంపిక చేసిన బతుకమ్మల నిర్వాహకులకు బహుమతులు అందజేశారు. మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనగా, ఉద్యోగ సంఘాల నాయకులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి స్వామి, ఆర్డీవోలు షర్మిల, జలకుమారి, జిల్లాస్థాయి అధికారులు, ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌ దారం శ్రీనివాస్‌రెడ్డి, కన్వీనర్‌ మడిపల్లి కాళీచరణ్‌ గౌడ్‌, టీఎన్జీవోల సంఘం కార్యదర్శి సంగేం లక్ష్మణ్‌రావు, కోశాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి, గెజిటెడ్‌ అధికారుల సంఘం జిల్లా కార్యదర్శి అరవింద్‌రెడ్డి, రెవెన్యూ సర్వీస్‌ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌, నేరెళ్ల కిషన్‌, మహిళా నాయకులు శారద, సునీత, సరిత, సూర్య, శైలజ, టీఎన్జీవోల సంఘం రాష్ట్ర నాయకులు రాగి శ్రీనివాస్‌, సర్దార్‌ హర్మీంధర్‌ సింగ్‌, ప్రభాకర్‌రెడ్డి, రమేష్‌గౌడ్‌, ప్రసాద్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాజేష్‌ భరద్వాజ్‌, కార్యదర్శి వెలిచాల సుమంత్‌రావు, మామిడి రమేష్‌, పోలూ కిషన్‌, అజ్గర్‌ అలీ, శంకర్‌, పెన్షనర్ల సంఘం నాయకుడు పెండ్యాల కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!