- విద్యార్థినులతో గణిత సమస్యలు పరిష్కరింపజేసి విద్యా ప్రమాణాల పరిశీలన.. వసతి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు
కోహెడ, నవంబర్ 17 (చైతన్యగళం):
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థినులతో ముచ్చటించారు. గణితంలోని సమస్యలను బోర్డుపై స్వయంగా పరిష్కరింపజేసి వారి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. చదువు, ఉపాధ్యాయుల బోధనా తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో వాష్‌రూమ్ సమస్య ఉందని విద్యార్థినులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థినులు తన దృష్టికి తీసుకొచ్చిన నీటి సమస్యను పరిష్కరించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తుచేశారు.
అనంతరం విద్యార్థినులకు అందిస్తున్న భోజనం నాణ్యతపై మంత్రి ఆరా తీశారు. ఎల్లప్పుడూ నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని, సిబ్బంది ఆహార నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం భవిష్యత్తుకు కీలకమని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువులో రాణిస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
గతంలో తాను ఎంపీగా ఉన్న సమయంలోనే తంగళ్లపల్లి కస్తూర్బా పాఠశాలను మంజూరు చేయించిన విషయాన్ని మంత్రి గుర్తుచేసుకున్నారు. పాఠశాల ప్రాంగణంలోని శంకుస్థాపన బోర్డును చూసి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థినులకు మెరుగైన విద్యతోపాటు అవసరమైన వసతులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పొన్నం ప్రభాకర్ సూచించారు.

