- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దు.. మంత్రి పొన్నం ప్రభాకర్ పాఠశాలను సందర్శించి వాస్తవాలు తెలుసుకోవాలి
కోహెడ, నవంబర్ 15 (చైతన్యగళం):
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణను రెండుగా విభజించేలా రూపొందించిన రహదారి అలైన్‌మెంట్‌ను వెంటనే మార్చాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థుల ఆస్తి పరిరక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా అఖిలపక్షం ఏకమవ్వాలని పిలుపునిచ్చారు.
బీజేపీ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్, ఇతర పార్టీ నాయకులతో కలిసి ఖమ్మం వేంకటేశం నాగసముద్రాల మోడల్ స్కూల్‌ను సందర్శించారు. ప్రతిపాదిత రహదారి అలైన్‌మెంట్ వల్ల పాఠశాలకు కలిగే నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోహెడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 700 నుంచి 800 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. సర్వే నంబర్ 263లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ప్రహరీ గోడతో సహా పాఠశాల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు.
కొంతమంది వ్యక్తులకు చెందిన రెండో, మూడో బిట్ల భూములకు ప్రధాన రహదారి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో మోడల్ స్కూల్ పరిధిలోనే రహదారి అలైన్‌మెంట్‌ను మార్చడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఈ అలైన్‌మెంట్ అమలైతే పాఠశాల ప్రాంగణం రెండుగా విడిపోవడమే కాకుండా, పాఠశాలలోని సగభాగం రహదారిలో కలిసిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు వాలీబాల్ కోర్టు వరకు రహదారి విస్తరించే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు ఆటస్థలం అందుబాటులో లేకుండా పోవడంతోపాటు విద్యా వాతావరణం, భద్రతకు విఘాతం కలుగుతుందని, భవిష్యత్తులో పాఠశాల మనుగడకే ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.
ఒక విద్యాసంస్థకు సంబంధించిన రహదారి అలైన్‌మెంట్‌ను పదేపదే మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని వేంకటేశం ప్రశ్నించారు. ఇప్పటివరకు మూడుసార్లు సర్వే నిర్వహించినప్పటికీ విద్యార్థులకు నష్టం కలిగించే విధంగానే అలైన్‌మెంట్ ఎందుకు రూపొందించారని నిలదీశారు. గత ఏడాది మోడల్ స్కూల్‌కు సంబంధం లేకుండా పాఠశాల ఖాతాలో సుమారు రూ.62 లక్షలు జమ చేయడం వెనుక ఉన్న ఉద్దేశమేమిటో వెల్లడించాలని కోరారు. ఈ అంశాలన్నింటిపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
సోమవారం కోహెడ మండలంలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నాగసముద్రాల మోడల్ స్కూల్‌ను స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని వేంకటేశం కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వివాదాస్పద రహదారి అలైన్‌మెంట్ పనులను నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాన్ని పరిశీలించాలని, అలైన్‌మెంట్ రూపొందించిన అధికారుల బాధ్యతను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు, విద్యాసంస్థల ఆస్తుల పరిరక్షణ ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, ఇది సమాజం మొత్తం బాధ్యత అని అన్నారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి మోడల్ స్కూల్ ఆస్తిని కాపాడేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రహదారి అలైన్‌మెంట్ మార్చే వరకు విద్యార్థుల పక్షాన నిలబడి అవసరమైతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు కలిసి వస్తే అఖిలపక్షం ఆధ్వర్యంలో, లేనిపక్షంలో బీజేపీ నేతృత్వంలో విద్యార్థులతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాన్ని కొనసాగించి పాఠశాల ఆస్తిని కాపాడుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ కోహెడ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్, మాజీ సర్పంచ్ మ్యాకాల చంద్రశేఖర్‌రెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు సామల గిరిధర్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కంది సత్యనారాయణరెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు నాగు అజయ్, బీజేపీ నాయకులు చిగురు రాజిరెడ్డి, మారెల్లి కరుణాకర్, దానవేని రమేష్, ఎడమల రాజురెడ్డి, వేముల రమేష్, గుంటి బాలయ్య, తాటిపాముల శంకరయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

