- పరిశుభ్రత, మత్తు పదార్థాల అనర్థాలపై విద్యార్థులకు అవగాహన.. పాఠశాలలకు చెత్తబుట్టల పంపిణీ
ఎల్కతుర్తి, నవంబర్ 14 (చైతన్యగళం):
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామంలో బాలల గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆరోగ్యం, పరిశుభ్రత, సామాజిక బాధ్యతలకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించారు.
గుట్కా, మద్యపానం వంటి అలవాట్ల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు. స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలకు చెత్తబుట్టలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బావుపేట గ్రామ సర్పంచ్ బత్తి రవీందర్ గౌడ్, ఉపసర్పంచ్ మేకల బాబు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

