Sunday, October 25, 2026
Homeతెలంగాణకరీంనగర్రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి

రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి

📰 Generate e-Paper Clip

  • ఏఎంసీ నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి పిలుపు
  • చైర్మన్‌గా రేవెల్లి రాజలింగం.. వైస్‌ చైర్మన్‌గా రేమిడి శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

మానకొండూర్‌, అక్టోబర్‌ 25 (చైతన్యగళం): రైతుల సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం పనిచేయాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మానకొండూర్‌ మండల కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో ఆదివారం నిర్వహించిన వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్‌గా రేవెల్లి రాజలింగం, వైస్‌ చైర్మన్‌గా రేమిడి శ్రీనివాస్‌రెడ్డితోపాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.

ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రైతుల పక్షాన నిలిచి పనిచేశారని, ఆయన బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, సబ్సిడీపై విత్తనాలు, వ్యవసాయ పనిముట్ల పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు నిర్వహిస్తున్నామని, కొనుగోలు చేసిన ధాన్యానికి 24 గంటల్లోనే డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. సన్న వడ్లకు బోనస్‌ అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నదాతల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పదవుల కేటాయింపులో సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యమిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవిని బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి కేటాయించగా, ఈసారి ఎస్టీ వర్గానికి అవకాశం కల్పించినట్లు వివరించారు. నూతన చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం మాట్లాడుతూ రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలతో ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన రైతులకు చేరేలా నూతన పాలకవర్గం కృషి చేయాలని సూచించారు. కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నర్సయ్య మాట్లాడుతూ అందరికీ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏఎంసీ, పీఏసీఎస్‌ పాలకవర్గాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

నూతన చైర్మన్‌ రేవెల్లి రాజలింగం మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే కవ్వంపల్లికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని, మార్కెట్‌ కమిటీ అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తానని హామీ ఇచ్చారు. వైస్‌ చైర్మన్‌ రేమిడి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. రైతులు విద్యుత్తు, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు గ్రామపంచాయతీ ఎదుట ఉన్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి, నూతన పాలకవర్గ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి గడి, పల్లె చౌరస్తా మీదుగా మార్కెట్‌ యార్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలు ఏకరూప దుస్తుల్లో డప్పు చప్పుళ్ల మధ్య ర్యాలీలో పాల్గొనగా, పలు చౌరస్తాల వద్ద బాణసంచా కాల్చారు.

నూతన పాలకవర్గంలో చైర్మన్‌గా రేవెల్లి రాజలింగం, వైస్‌ చైర్మన్‌గా రేమిడి శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్లుగా ఎర్రాల కవిత, తమ్మిశెట్టి రాజేశ్‌, రామినేని రమణ, కనకం అశోక్‌, రేపాక రాజేశ్వర్‌, కొత్తిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మందల సంపత్‌రెడ్డి, ముక్కెర సతీష్‌కుమార్‌, ఆరవేణి రామాంజయ్య, దూలం వీరస్వామి, విశ్వనాథుల వీర కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారి షాబోద్దీన్‌, తహసీల్దార్‌ కె. విజయ్‌కుమార్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తాళ్లపల్లి సంపత్‌గౌడ్‌, గొల్లేన కొమురయ్య, బోళ్ల మురళీధర్‌, వివిధ పీఏసీఎస్‌, ఏఎంసీ చైర్మన్లు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!