- గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు వైద్యసాయం అందించాలి
- సీసీ కెమెరాల నిఘా, హైవే పెట్రోలింగ్ నిరంతరం కొనసాగాలి: సీపీ గౌస్ ఆలం
మానకొండూర్, అక్టోబర్ 24 (చైతన్యగళం): వరంగల్–కరీంనగర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-563)పై రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అధికారులను ఆదేశించారు. నూతనంగా నిర్మించిన జాతీయ రహదారిపై ప్రయాణికుల భద్రత కోసం చేపట్టిన ఏర్పాట్లను శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఉన్న హైవే పెట్రోలింగ్ యూనిట్, టోల్‌ప్లాజా పరిపాలనా విభాగాన్ని సందర్శించారు. సీసీ కెమెరాల పనితీరు, నిఘా వ్యవస్థ, నియంత్రణ గది ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షించే విధానాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సమాచారం అందుకునే వ్యవస్థ, ప్రమాద స్థలానికి సిబ్బంది చేరుకునే విధానం, క్షతగాత్రులకు వైద్యసాయం అందించేందుకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
హైవే పెట్రోలింగ్ వాహనాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులకు ప్రాణాపాయం తగ్గించేలా తొలి గంటలోనే (గోల్డెన్ అవర్) స్పందించి, వీలైనంత త్వరగా ఆసుపత్రులకు తరలించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం పోలీసు, వైద్య సిబ్బంది మధ్య సమన్వయాన్ని మరింత పటిష్టం చేయాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తూ, అతివేగంగా వెళ్లే వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పరిశీలనలో హుజూరాబాద్ ఏసీపీ మాధవి, రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కేశవపట్నం ఎస్ఐ శేఖర్, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రతినిధులు, టోల్‌ప్లాజా నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.
