Monday, October 19, 2026
Homeతెలంగాణకరీంనగర్బతుకమ్మ వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలి

బతుకమ్మ వేడుకలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలి

📰 Generate e-Paper Clip

  • లోయర్‌ మానేరు డ్యామ్‌ నిమజ్జన కేంద్రాలను పరిశీలించిన పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం
  • ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం

కరీంనగర్‌, అక్టోబర్‌ 18 (చైతన్యగళం):

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం, ఐపీఎస్‌ ఆదేశించారు. ఆదివారం నగరంలోని ప్రధాన బతుకమ్మ వేడుకల ప్రాంగణాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాలు, లోయర్‌ మానేరు డ్యామ్‌ వద్ద నిమజ్జన ప్రాంతాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, విద్యుత్‌ దీపాల ఏర్పాటు, రక్షణ కంచెలు, గజ ఈతగాళ్ల లభ్యత, వాహనాల నిలుపుదల స్థలాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల వాహనాల మళ్లింపు మార్గాలు ఏర్పాటు చేయడంతో పాటు విస్తృతంగా పార్కింగ్‌ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

లోయర్‌ మానేరు డ్యామ్‌తో పాటు ప్రధాన చెరువుల వద్ద బతుకమ్మ నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బారికేడ్లు, రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక రక్షణ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనే వేడుకల ప్రాంగణాల్లో షీ టీమ్స్‌, సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులతో నిఘా పెంచాలని, ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

మున్సిపల్‌, విద్యుత్‌, రెవెన్యూ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పారిశుధ్యం, నిరంతర విద్యుత్‌ సరఫరా, తాగునీటి సదుపాయాలు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బతుకమ్మ పండుగను ప్రజలంతా ప్రశాంతంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ కోరారు. పోలీసు శాఖ సూచించే ట్రాఫిక్‌ నిబంధనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ పర్యటనలో అదనపు పోలీస్‌ కమిషనర్లు వెంకటస్వామి, విజయకుమార్‌, ట్రాఫిక్‌ అధికారులు, స్థానిక ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!