హుస్నాబాద్, అక్టోబర్ 17 (చైతన్యగళం):
బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్‌లోని ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ వేడుకల నిర్వహణకు చేపడుతున్న ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. చెరువు కట్టపై బతుకమ్మ ఘాట్ మెట్ల వద్దే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ చెరువు వైపు భద్రతా కంచెలు ఏర్పాటు చేయాలని, తగినంత వెలుతురు ఉండేలా దీపాల సదుపాయం కల్పించాలని సూచించారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించి, వాటి పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు కట్టపై నూతనంగా నిర్మిస్తున్న మైసమ్మ ఆలయ పనులను కూడా పరిశీలించారు.
అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగను మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని కోరారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతోపాటు గాజు వంతెన నిర్మాణం, కప్పగుట్టను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణంలో పట్టణ అటవీ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తున్నామని, క్రీడలకు ప్రోత్సాహం అందించేందుకు కబడ్డీ అకాడమీ మంజూరు చేశామని చెప్పారు. హుస్నాబాద్‌కు ఈతకొలను మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో రానున్నాయని వెల్లడించారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి రహదారి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, కొత్తపల్లి–హుస్నాబాద్, హుస్నాబాద్–జనగామ మార్గాల్లో నాలుగు వరుసల రహదారుల అభివృద్ధి చేపడుతున్నట్లు వివరించారు.
విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కోహెడలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల నిర్మాణం జరుగుతోందని, శాతవాహన విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాలకు సంబంధించిన భవన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. 250 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా వేగంగా జరుగుతోందన్నారు. చిగురుమామిడిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఎలకతుర్తిలో ఐఐఐటీ శాఖ, వంగరలో నవోదయ పాఠశాల ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సైదాపూర్‌కు మరో పబ్లిక్ స్కూల్ మంజూరు కానుండగా, అక్కన్నపేటకు కూడా పాఠశాల కోసం ప్రతిపాదనలు చేసినట్లు పేర్కొన్నారు. అక్కన్నపేట, ఎలకతుర్తి మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు మంజూరయ్యాయని, ఆర్డీవో కార్యాలయానికి సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.
గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయని, కాలువల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. భూసేకరణ పూర్తయిన వెంటనే కాలువల పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఎంఎంఆర్ ప్యాకేజీ కింద కూడా పనులు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. సాగునీటి రంగానికి ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు.
వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా, పంటలు చేతికొచ్చే వరకు రాత్రివేళల్లోనూ విద్యుత్ అందించే చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. పంటలు ఎండిపోకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతోందన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని రాబోయే వేసవిలో తాగునీటి అవసరాలకు ఉపయోగించుకునేలా పొదుపుగా వినియోగించాలని సూచించారు. కరువు ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు. నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్లో వరి సాగును వాయిదా వేసి, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేందుకు ముందస్తు జాగ్రత్తలు అవసరమని, రైతులకు అండగా నిలవాల్సిన సమయంలో రాజకీయాలకు తావివ్వకూడదని అన్నారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ‘పల్లె పల్లెకు పొన్నం అన్న’ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడంతోపాటు సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఈ ఒక్క ఏడాదిలోనే నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తూ, అర్హులైన వారందరికీ నిష్పక్షపాతంగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పట్టణంలో 500 ఇళ్లు కేటాయించినట్లు వెల్లడించారు. గత పదేళ్లలో ఇళ్ల నిర్మాణం విషయంలో ఆశించిన పురోగతి లేదని విమర్శించారు. ఎల్లమ్మ చెరువుతోపాటు కొత్త చెరువు, పల్లె చెరువులను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైతే సహించబోమని, ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ప్రభుత్వ భూములను కాపాడటం తమ బాధ్యతని స్పష్టం చేశారు. హుస్నాబాద్‌లో స్టేడియం నిర్మాణంతోపాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉందన్నారు. ఆరేపల్లి చెరువు వద్ద కూడా బతుకమ్మ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, ఆర్డీవో రామ్మూర్తి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
