Sunday, October 18, 2026
Homeక్రైమ్ న్యూస్శీతలా దేవి ఆలయం వద్ద ఘోర ప్రమాదం.. 12 మంది భక్తులు మృతి

శీతలా దేవి ఆలయం వద్ద ఘోర ప్రమాదం.. 12 మంది భక్తులు మృతి

📰 Generate e-Paper Clip

  • భక్తులపైకి దూసుకెళ్లిన ధాన్యం లోడు ట్రక్కు.. మరో ఐదుగురి పరిస్థితి విషమం

గ్వాలియర్‌(చైతన్యగళం): మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శీతలా దేవి ఆలయం సమీపంలో భక్తులపైకి భారీ ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లడంతో 12 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవరాత్రుల సందర్భంగా శీతలా దేవి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో చిన్నూర్‌ నుంచి వరి ధాన్యం లోడుతో వస్తున్న ట్రక్కు వాలుగా ఉన్న రహదారిపైకి ఎక్కే సమయంలో అదుపుతప్పి సమీపంలో ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భక్తులతోపాటు ఆలయంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మొత్తం 39 మందిని ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు ఆలయ గేటు, గోడలు కూడా దెబ్బతిన్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు, ప్రమాదం జరిగిన మార్గంలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ ట్రక్కు పోలీసుల బారికేడ్లు, తనిఖీ కేంద్రాలను దాటుకుని ఎలా వచ్చిందనే అంశంపై విచారణ జరుపుతున్నట్లు గ్వాలియర్‌ జిల్లా కలెక్టర్‌ రుచికా చౌహాన్‌ తెలిపారు. 12 మంది భక్తులు మృతి చెందడంపై ఆమె విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లలో ఏవైనా లోపాలు ఉన్నాయా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!