- ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో హాజరుకావాలి: జిల్లా అధ్యక్షుడు గడిపే కొమురయ్య
హుస్నాబాద్, అక్టోబర్ 17 (చైతన్యగళం):
తెలంగాణ మాదిగ పోరాట సమితి (టీఎంపీఎస్) ఆధ్వర్యంలో ఈ నెల 30న హైదరాబాద్లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ముఖ్య నాయకుల సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గడిపే కొమురయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హుస్నాబాద్లోని అంబేడ్కర్ చౌరస్తాలో సమావేశానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.
అనంతరం గడిపే కొమురయ్య మాట్లాడుతూ, రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న ఈ సమావేశానికి సిద్దిపేట జిల్లా పరిధిలోని నియోజకవర్గ, మండల స్థాయి ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సంఘం నాయకులు సమన్వయంతో వ్యవహరించి సమావేశానికి విస్తృత ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గూటం రాజు, కోహెడ రాజు, కొమ్ముల సంపత్, తొందూరి ఎల్లన్న తదితరులు పాల్గొన్నారు.
