- జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, అక్టోబర్ 17 (చైతన్యగళం):
హుస్నాబాద్ నియోజకవర్గానికి కబడ్డీ అకాడమీ మంజూరు కావడంతో స్థానిక క్రీడాకారులకు మెరుగైన శిక్షణ, సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కబడ్డీ అకాడమీ మంజూరైన సందర్భంగా హుస్నాబాద్ క్రీడా సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా అకాడమీ మంజూరుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్కు క్రీడా సంఘం ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. కబడ్డీ కోచ్ కృష్ణను మంత్రి అభినందించి ఘనంగా సత్కరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ, హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి కబడ్డీ అకాడమీ ఎంతగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి నాణ్యమైన శిక్షణతోపాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులను తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారులు ఎదిగి తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకుని, క్రమశిక్షణతో సాధన చేస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. హుస్నాబాద్ ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి, యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
