- ఉద్యోగ భద్రత కల్పించి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలి: డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోత్
హైదరాబాద్, అక్టోబర్ 18 (చైతన్యగళం):
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఫోరం వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోత్ డిమాండ్ చేశారు. ఉద్యోగులకు భద్రత కల్పించడంతోపాటు, వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజారోగ్య పరిరక్షణలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీ/సీహెచ్ఓలు, ఆర్బీఎస్కే పారామెడికల్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. తల్లి, శిశు ఆరోగ్య సంరక్షణ, టీకాల కార్యక్రమాలు, అంటువ్యాధుల నియంత్రణతోపాటు వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో వారి సేవలు ఎంతో కీలకమన్నారు. ఇంతటి బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఏళ్ల తరబడి ఉద్యోగ భద్రత లేకపోవడం, వేతనాలు, సర్వీసు నిబంధనలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో సమస్యలు కొనసాగడం ఆందోళనకరమని అన్నారు.
దీర్ఘకాలంగా సేవలందిస్తున్న అర్హులైన ఎన్హెచ్ఎం ఉద్యోగుల సేవలను వర్తించే నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని డాక్టర్ కుమార్ నాయక్ కోరారు. ఉద్యోగులందరికీ స్పష్టమైన విధానం ద్వారా ఉద్యోగ భద్రత కల్పించాలని, చట్టపరమైన నిబంధనలు, న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించడంతోపాటు, వేతనాల చెల్లింపులో జాప్యాన్ని నివారించి ప్రతి నెలా నిర్ణీత సమయంలో జీతాలు అందించాలని సూచించారు. అర్హతలను బట్టి వార్షిక వేతన పెరుగుదల, వేతన సవరణ ప్రయోజనాలు కల్పించాలని కోరారు.
మహిళా ఉద్యోగులకు వర్తించే నిబంధనల ప్రకారం 180 రోజుల ప్రసూతి సెలవులతోపాటు ఇతర అర్హతగల సెలవు సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఉద్యోగులకు వర్తించే నిబంధనల మేరకు ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్), ఆరోగ్య బీమా, ఈఎస్ఐ, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించాలని కోరారు. ప్రభుత్వ ఉత్తర్వులు, వర్తించే నిబంధనల ప్రకారం వేతన సవరణలు, బకాయిలు, ఇతర పెండింగ్ ఆర్థిక ప్రయోజనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒప్పంద, ఇతర నియామక విధానాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు, సేవా నిబంధనలు, బదిలీల విషయంలో పారదర్శకత పాటించాలని పేర్కొన్నారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని డాక్టర్ కుమార్ నాయక్ డుంగ్రోత్ కోరారు. సమస్యల పరిష్కారానికి కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సేవలను గుర్తించి గౌరవప్రదమైన వేతనాలు, మెరుగైన సేవా పరిస్థితులు, ఉద్యోగ భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజలకు అందించే వైద్య సేవలను మరింత బలోపేతం చేయవచ్చని అన్నారు. న్యాయమైన హక్కుల సాధన కోసం తెలంగాణ ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఫోరం ప్రజాస్వామ్యబద్ధంగా తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫోరం వైస్ చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
