- రైతులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచన
మానకొండూరు, అక్టోబర్ 14 (చైతన్యగళం): రానున్న రోజుల్లో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. బుధవారం మానకొండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వి.వి. వరలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మండలంలో ఇప్పటికే వరి సాగు వంద శాతం పూర్తయిందని, భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని, గ్రామ పంచాయతీలు, గృహాలు, సహకార సంఘాల భవనాలపై సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. వీటి ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని తెలిపారు.
స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారులు తగిన గౌరవం ఇవ్వాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. పంచాయతీరాజ్ సహాయ ఇంజినీర్ వెంకన్న పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు సర్పంచులు నెలకు కనీసం రెండుసార్లు లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి పనుల పురోగతిని పరిశీలించాలని సూచించారు. ప్రతి 45 రోజులకు నిర్వహించే తదుపరి సమీక్షా సమావేశం నాటికి అభివృద్ధి పనుల్లో స్పష్టమైన పురోగతి కనిపించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రత్యేక అధికారి సరస్వతి, తహసీల్దార్ విజయ్‌కుమార్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు పెంచాల కిషన్‌రావు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
