- ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ల ఏర్పాటుపై హర్షం
- సీఎం రేవంత్‌రెడ్డికి డి.టి. నాయక్ కృతజ్ఞతలు
అక్కన్నపేట, నవంబర్ 6 (చైతన్యగళం): ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని కాంగ్రెస్ నాయకుడు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ధరావత్ తిరుపతి నాయక్ (డి.టి. నాయక్) అన్నారు. ఈ నిర్ణయం గిరిజనుల చిరకాల డిమాండ్‌కు పరిష్కారం చూపే దిశగా కీలక ముందడుగని పేర్కొన్నారు.
అక్కన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గిరిజనులకు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు దిశగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను గిరిజన సంఘాలు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయడం అభినందనీయమన్నారు.
ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఇందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, సహకరించిన ఇతర మంత్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి బంజారా సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటుతో గిరిజనులు తమ సమస్యలను నేరుగా కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం కలుగుతుందని, తద్వారా వారి హక్కుల పరిరక్షణతో పాటు సంక్షేమం, అభివృద్ధికి మరింత ప్రాధాన్యత లభిస్తుందని డి.టి. నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
