- రైతులు అప్రమత్తంగా ఉండాలి.. నీటిని పొదుపుగా వినియోగించాలి – ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
కరీంనగర్, అక్టోబర్ 13(చైతన్యగళం):
ఎల్‌నినో వంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలను, రైతులను కాపాడేందుకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
ప్రపంచ వాతావరణ సంస్థ అంచనాల ప్రకారం ఎల్‌నినో ప్రభావం డిసెంబర్‌లో గరిష్ఠ స్థాయికి చేరే అవకాశం ఉందని, 2027 వరకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం కారణంగా వ్యవసాయం, తాగునీటి సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని గత నాలుగు నెలలుగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, జిల్లా యంత్రాంగం ద్వారా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడుకోవడంతో పాటు నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. జలాశయాలు, ప్రాజెక్టులు, చెరువుల్లో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాలని అన్నారు. నీటి లభ్యత లేని ప్రాంతాల్లో పంటలు సాగు చేసి నష్టపోవద్దని, వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను ఎంచుకోవాలని తెలిపారు. ఉద్యాన పంటలను కాపాడుకోవాలని, ఎల్‌నినోపై వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. రైతులను కాపాడేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలని కోరారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో వ్యవసాయ రంగానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే రైతులను అప్రమత్తం చేశామని, రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం సుమారు 15 లక్షల ఎకరాలు తగ్గిందని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అందుబాటులో ఉన్న వనరులతో పంటలు పండించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రైతులు నూనెగింజలు, పప్పుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని, ప్రస్తుతం సాగులో ఉన్న పంటలను కాపాడుకోవాలని సూచించారు. రబీ సీజన్‌లో తక్కువ కాలంలో చేతికొచ్చే పంటలను ఎంచుకోవాలని అన్నారు. జలాశయాల్లోని నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించేలా జిల్లా కలెక్టర్లు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, విద్యుత్ శాఖ ఉన్నతాధికారి నవీన్ మిట్టల్, ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి, వాతావరణ శాఖ అధికారులు, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, పశుసంవర్ధక శాఖ అధికారులు తమ తమ శాఖల ద్వారా చేపట్టనున్న చర్యలను వివరించారు.
రైతు వేదిక నుంచి కలెక్టర్ చిత్రా మిశ్రా
ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కొత్తపల్లి (హెచ్) రైతు వేదిక నుంచి హాజరయ్యారు. అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్‌డీఓ గీత, విద్యుత్ శాఖ డీఈ రాజం, జిల్లా మార్కెటింగ్ అధికారి షాబుద్దీన్‌తో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు పాల్గొన్నారు.
