Saturday, October 3, 2026
Homeతెలంగాణకరీంనగర్జైలు జీవితం మార్పునకు వేదిక కావాలి

జైలు జీవితం మార్పునకు వేదిక కావాలి

📰 Generate e-Paper Clip

కరీంనగర్, అక్టోబర్ 2 (చైతన్యగళం):

జైలు జీవితం మార్పునకు వేదిక కావాలని, గతం గురించి ఆలోచించకుండా ఇక్కడున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని నైపుణ్యాలను పెంచుకుంటూ, చదువు నేర్చుకొని బయటకు వెళ్లిన తర్వాత మంచి పౌరులుగా ఉన్నత స్థాయిలో ఉండేలా బాటలు వేసుకోవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఖైదీలకు సూచించారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని జైలులో ఖైదీల సంక్షేమ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జడ్జి శివకుమార్, కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జైలు సిబ్బంది ఖైదీల సంక్షేమం, నైపుణ్యాలు పెంచేందుకు అందిస్తున్న శిక్షణ వివరాలు, పెట్రోల్ బంకు, అప్రెంటిషిప్ ద్వారా కల్పిస్తున్న ఉపాధి, వసతి, కౌన్సెలింగ్, వైద్య సౌకర్యాల గురించి వివరించారు.

కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ ఖైదీల కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే అవసరమైన వైద్యసాయం అందించాలని, వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ద్వారా ఖైదీలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఖైదీల సంక్షేమం కోసం జైలు వెల్ఫేర్ సొసైటీ తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. జైలు జీవితం ఖైదీలలో పరివర్తన తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా జడ్జి శివకుమార్ మాట్లాడుతూ సత్యం, అహింస అనే ఆయుధాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు గాంధీజీ అని పేర్కొన్నారు. జైలు అంటే శిక్షించే స్థలం కాదని, ఖైదీలను సంస్కరించే ప్రదేశమని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ ఎన్నో రోజులు జైలు జీవితం గడిపారని, జైలు జీవితంలోనే క్రమశిక్షణ నేర్చుకొని రామాయణం, ఇతర పుస్తకాలు చదివి జ్ఞానాన్ని పెంచుకున్నారని తెలిపారు. జైలు జీవితం శిక్షా కాలం కాదని, ఆధ్యాత్మిక శిక్షణ కేంద్రం అని గాంధీజీ చెప్పినట్లు జడ్జి పేర్కొన్నారు. ఖైదీల సంక్షేమానికి వైద్య సేవలు, ఉల్లాసంగా గడపడానికి యోగ విద్య, ఇతర ఆటల పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

సెక్రటరీ యశ్వంత్ సింగ్ మాట్లాడుతూ జైలుకు వచ్చిన తర్వాత స్వేచ్ఛ విలువ తెలుస్తుందని, కోపం, ప్రతీకారం తగ్గించుకోవాలని ఖైదీలకు సూచించారు. సమస్య వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా, భావోద్వేగాలను నియంత్రించుకొని ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగాలని పేర్కొన్నారు. గతం మన చేతుల్లో లేదని, భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించుకొని ముందుకు సాగాలని సూచించారు. జైలు నుంచి బయటకు వెళ్లేటప్పటికీ కుటుంబ సభ్యులకు తమలో మారిన మనిషి కనిపించాలని అన్నారు.

పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ జైలులో ఉన్న సౌకర్యాలను, నైపుణ్యాభివృద్ధి శిక్షణను సద్వినియోగం చేసుకొని బాధ్యత కలిగిన వ్యక్తులుగా బయటకు వెళ్లాలని ఖైదీలకు సూచించారు. కోపంలో నిర్ణయం తీసుకుంటే తర్వాత బాధపడాల్సి వస్తుందని, కొత్త ఆలోచనలతో తమను తాము ఆవిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ఖైదీలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సద్వినియోగం చేసుకొని చదువుపై దృష్టి సారించాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ రాజగోపాల్ ఖైదీలకు అందిస్తున్న వైద్య సౌకర్యాలు, కౌన్సెలింగ్ వివరాలను తెలిపారు.

ఈ సందర్భంగా అతిథులను శాలువాలతో సత్కరించారు. కళాకారుల పాటలు, చిన్నారుల నృత్యాలు అలరించాయి. అనంతరం పాటల పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఖైదీలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో జైలు శాఖ అధికారులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!