- భూసేకరణ, పునరావాసం, పర్యావరణ అనుమతులపై మంత్రుల సమీక్ష
హుస్నాబాద్, అక్టోబర్ 3 (చైతన్యగళం): గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు పనుల పురోగతిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, పునరావాసం, పర్యావరణ అనుమతులు, సవరించిన అంచనాలు, కాలువల పనులు, నీటి నిల్వలు తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.
2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 2013 నాటికి సుమారు 57 శాతం పనులు పూర్తయ్యాయి. అనంతరం వివిధ పరిపాలనా కారణాలతో భూసేకరణ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది.
2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించడంతో గణనీయమైన పురోగతి సాధించినట్లు అధికారులు మంత్రులకు వివరించారు. మిగిలిన భూసేకరణను కూడా వేగవంతం చేసి పనులను ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు సూచించారు.
ఎకరాకు రూ.17 లక్షల పరిహారం
గౌరవెల్లి రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.17 లక్షల చొప్పున పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. భూసేకరణకు సంబంధించిన పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని మంత్రులు ఆదేశించారు. వివాహిత కుమార్తెలకు పునరావాస ప్రయోజనాలు, పాత, కొత్త ముంపు ప్రాంతాల పరిధిలోని కుటుంబాలకు సంబంధించిన అంశాలను కూడా సమీక్షించారు.
కాలువల భూసేకరణపై దృష్టి
గౌరవెల్లి కాలువలకు సంబంధించిన భూసేకరణ పురోగతినీ మంత్రులు పరిశీలించారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసి లబ్ధిదారులకు పరిహారం చెల్లింపులు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు. మిగిలిన భూసేకరణను వేగవంతం చేసి కాలువల పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని మంత్రులు ఆదేశించారు.
పర్యావరణ అనుమతులు కీలకం
గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పర్యావరణ అనుమతుల అంశంపైనా సమావేశంలో చర్చించారు. సంబంధిత కేంద్ర సంస్థల మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన అనుమతులు పొందేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయని వివరించారు. పర్యావరణ అనుమతుల కోసం కాలపరిమితితో చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.
సవరించిన అంచనాలు
భూసేకరణ, పునరావాసం, ధరల పెరుగుదల తదితర కారణాలతో గౌరవెల్లి రిజర్వాయర్, కాలువలకు సంబంధించిన సవరించిన అంచనాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన పనులకు పరిపాలనా అనుమతులు పొందిన అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఎంఎంఆర్ ప్యాకేజీ-3 పనులకు సంబంధించిన సవరించిన అంచనాలు, అదనపు నిర్మాణాల ప్రతిపాదనలు, భవిష్యత్ కార్యాచరణపైనా సమావేశంలో సమీక్షించారు.
అవసరమైన పర్యావరణ, ఇతర ప్రభుత్వ అనుమతులు పొందిన వెంటనే గౌరవెల్లి రిజర్వాయర్ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని పెండింగ్ అంశాలను నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు. భూసేకరణ, పునరావాసం, అనుమతుల విషయంలో జాప్యం లేకుండా చర్యలు చేపట్టి, ప్రాజెక్టు పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు పూర్తి చేసే దిశగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
సమావేశంలో నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ. శ్రీధర్, భూసేకరణ–పునరావాస కమిషనర్ శివకుమార్ నాయుడు, ఈఎన్‌సీ జనరల్ రమేష్ బాబు, ఈఎన్‌సీ ఓఅండ్‌ఎం మధుసూదన్ రావు, జాయింట్ సెక్రటరీ కె. శ్రీనివాస్‌తో పాటు మూడు జిల్లాలకు చెందిన అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
