కరీంనగర్, అక్టోబర్ 21 (చైతన్యగళం): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుడు, సబ్ఇన్స్పెక్టర్ ఉండాటి సంజీవ్ విగ్రహానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం, ఐపీఎస్, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామానికి చెందిన ఉండాటి సంజీవ్, బాలరాజు కుమారుడు. 1964 ఆగస్టు 10న జన్మించిన ఆయన 1991 జూలై 15న సబ్ఇన్స్పెక్టర్గా పోలీస్ శాఖలో నియమితులయ్యారు. విధి నిర్వహణలో భాగంగా 2002 మార్చి 11న అప్పటి వరంగల్ జిల్లా ఏటూరునాగారం ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు.
ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలనే త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం పేర్కొన్నారు. వారి త్యాగాలు పోలీస్ సిబ్బందికి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని తెలిపారు.
