Friday, October 2, 2026
Homeతెలంగాణకరీంనగర్పెండింగ్‌ ఎస్‌ఐఆర్‌ నోటీసులను వారం రోజుల్లో పరిష్కరించాలి

పెండింగ్‌ ఎస్‌ఐఆర్‌ నోటీసులను వారం రోజుల్లో పరిష్కరించాలి

📰 Generate e-Paper Clip

కరీంనగర్, అక్టోబర్ 1 (చైతన్యగళం):

ఎస్‌ఐఆర్‌లో హియరింగ్‌ కాకుండా ఉన్న 25 వేల నోటీసులకు సంబంధించి బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి సరైన ధ్రువపత్రాలు సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ సూపర్‌వైజర్లను ఆదేశించారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కరీంనగర్‌ అర్బన్‌, రూరల్‌, కొత్తపల్లి మండలాల ఎమ్మార్వోలు, బీఎల్వో సూపర్‌వైజర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెండో దశ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నోటీసుల జారీ, హియరింగ్‌, ఆన్‌లైన్‌ నమోదు తదితర అంశాలపై సమీక్షించారు.

కరీంనగర్‌ నియోజకవర్గానికి సంబంధించి రెండో దశ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో మొత్తం 93 వేల నోటీసులు జారీ చేయగా, దాదాపు 25 వేల నోటీసులు హియరింగ్‌కు పెండింగ్‌లో ఉన్నాయని కమిషనర్‌ తెలిపారు. వీటిని వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. హియరింగ్‌కు రాని ఓటర్ల జాబితా ప్రకారం బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ధ్రువపత్రాలు సేకరించి వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న నోటీసులను కూడా వెంటనే జారీ చేయాలని, ప్రతిరోజూ 30 నోటీసులకు సంబంధించిన ధ్రువపత్రాలను సేకరించి అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.

డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాలో మరణించిన ఓటర్లు ఉంటే సూపర్‌వైజర్లు స్పీకింగ్‌ ఆర్డర్‌ ఇవ్వాలని, డబుల్‌ ఓట్లు ఉన్నాయా అనే అంశాన్ని బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. ఇప్పటికే ధ్రువపత్రాలు సేకరించిన బీఎల్‌ఓలు వాటిని రేపటిలోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియలో జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి పెండింగ్‌ లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. నోటీసులు జారీ అయిన ఓటర్లు తమ ధ్రువపత్రాలతో హియరింగ్‌కు హాజరై ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కమిషనర్‌ పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ ఆయాజ్‌, డిప్యూటీ కమిషనర్లు ఖాధర్‌ మొహియుద్దీన్‌, వేణు మాధవ్‌, ఎమ్మార్వోలు రాజేష్‌, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!