- దసరా సెలవుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి: టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి
హనుమకొండ, సెప్టెంబరు 30 (చైతన్యగళం): ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేసి దసరా సెలవుల్లో ప్రక్రియను పూర్తి చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హనుమకొండలో నిర్వహించిన తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేసి 50 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీపీఎఫ్, ప్రభుత్వ జీవిత బీమా, పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయడంతో పాటు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అన్నారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రావుల రమేష్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ హామీని అమలు చేసి వేతన స్కేళ్లు వర్తింపజేయాలని కోరారు. ఉపాధ్యాయులను తరగతి గదులకు దూరం చేసే బాహ్య మూల్యాంకన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బత్తిని శ్రీరామాంజనేయులు, గొడిశాల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో శిక్షణలు, ఆన్‌లైన్ నమోదు, వివిధ యాప్‌ల నిర్వహణతో ఉపాధ్యాయులపై మానసిక ఒత్తిడి పెరుగుతోందన్నారు. పాఠశాల పనివేళల్లో నిర్వహించే బోధనేతర కార్యక్రమాలు, శిక్షణలను రద్దు చేయాలని కోరారు. జీవో 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమావేశంలో సీనియర్ నాయకులు బిల్ల సుబ్బారావు, రాష్ట్ర కౌన్సిలర్ ముత్యాల రఘుపతి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రగిరి లక్ష్మయ్య, ఇప్పకాయల కుమారస్వామి, చందుపట్ల రాజేంద్రం, జిల్లా కార్యదర్శులు అంకం శ్రీనివాస్, గొడిశాల రమేష్, లకుం భాస్కర్, డి.శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
