సిద్దిపేట, సెప్టెంబర్ 30 (చైతన్యగలం):
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో విద్యాశాఖపై జిల్లా విద్యాశాఖ అధికారులు, ఏంఈఓలు, కో-ఆర్డినేటర్లతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యా ప్రమాణాలు, నిరుపేద విద్యార్థులకు మంచి విద్యను అందించడం కోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రతి నెల విద్యాశాఖపై సమీక్ష నిర్వహించి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్, కేజీబీవీలలో డ్రాప్‌అవుట్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, విద్యార్థులతో మాట్లాడి డ్రాప్‌అవుట్ కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు శాతం తగ్గిందని ఆరా తీయగా, ఆయా వసతి గృహాల్లోని విద్యార్థులు రావడం లేదని ఏంఈఓలు తెలిపారు. దీంతో ఒక వసతి గృహం వార్డెన్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలను ఆరా తీశారు. పాఠశాలకు విద్యార్థులు హాజరు కాకపోవడానికి ఖచ్చితమైన కారణాలను తెలుసుకుని, విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉపాధ్యాయుల ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరుపై సమీక్షిస్తూ ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరును పర్యవేక్షించాలని, ఏంఈఓల అనుమతి లేనిదే ఉపాధ్యాయులు సెలవు తీసుకోకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యార్థుల కేంద్రంగా విద్యాబోధన చేసి ప్రతి ఒక్కరూ పాస్ అయ్యేలా చూడాలని, అదేవిధంగా విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలని అన్నారు. విద్యాశాఖలో అన్ని విధాలుగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, విద్యారంగంలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా విద్యాబోధన సాగాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, సెక్టోరల్ అధికారి రామస్వామి, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
