కరీంనగర్, సెప్టెంబర్ 30 (చైతన్యగళం):
కరీంనగర్ జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి నగర ప్రథమ పౌరుడు, మేయర్ కొలగాని శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. బుధవారం కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యమంత్రికి మేయర్ పుష్పగుచ్చం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ, అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వడ్లూరు లక్ష్మణ్ కుమార్, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక శాసనసభ్యులతో కలిసి నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా పురోగతికి సంబంధించి పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.
కార్యక్రమం అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అత్యవసర అభివృద్ధి పనుల నిమిత్తం రూ.300 కోట్ల ప్రత్యేక అస్యూరెన్స్ ఫండ్ మంజూరు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, నగర ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థలో సమీప గ్రామాలు నగరపాలక సంస్థలో విలీనం కావడంతో నగర జనాభా, భౌగోళిక విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం నగర జనాభా 5 లక్షలకు చేరడంతో పాటు విస్తీర్ణం సుమారు 112 చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందని సీఎంకు విన్నవించినట్లు తెలిపారు. విలీన గ్రామాల డివిజన్లలో ప్రజలకు మెరుగైన వసతులు, మౌలిక సౌకర్యాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.300 కోట్ల ప్రత్యేక అస్యూరెన్స్ నిధులు తక్షణమే మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరినట్లు వెల్లడించారు. అంతేకాకుండా గతంలో సీఎం అస్యూరెన్స్ స్కీంలో నగరపాలక సంస్థకు రావాల్సిన పెండింగ్ నిధులను కూడా విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.
