Saturday, September 26, 2026
Homeతెలంగాణరేకొండ రైతులకు పట్టాలు ఇవ్వాలి

రేకొండ రైతులకు పట్టాలు ఇవ్వాలి

📰 Generate e-Paper Clip

  • రెవెన్యూ మంత్రి పొంగులేటికి మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి వినతి

చిగురుమామిడి, సెప్టెంబరు 24 (చైతన్యగళం): కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలోని సర్వే నంబర్‌ 927తో పాటు ఇతర సర్వే నంబర్లలో దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న రైతులకు భూములపై పట్టాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సచివాలయంలో రేకొండ రైతులతో కలిసి మంత్రికి వినతిపత్రం అందజేశారు.

రేకొండలో పలువురు రైతులు, వారి కుటుంబాలు సుమారు 60 ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని చాడ వెంకటరెడ్డి మంత్రికి వివరించారు. తమ శ్రమతో భూములను సాగుకు అనుకూలంగా మార్చుకుని వివిధ పంటలు పండిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. గతేడాది రెవెన్యూ అధికారుల నివేదికలో మొత్తం 103.03 ఎకరాల భూమి లబ్ధిదారుల అనుభవంలో ఉన్నట్లు పేర్కొన్నారని వివరించారు.

సర్వే నంబర్‌ 927లో కాలువ నిర్మాణానికి 2.09 ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు, కాలువ విస్తీర్ణాన్ని మినహాయిస్తే 2.04 ఎకరాల భూమి ప్రస్తుత అనుభవంలో ఉన్నట్లు రెవెన్యూ నివేదికలో పేర్కొన్నారని తెలిపారు. సేకరించిన 2.09 ఎకరాలకు సంబంధించి అవార్డు జారీ లేదా పరిహారం చెల్లింపునకు సంబంధించిన రికార్డులు లేవని అధికారులు తెలిపినట్లు పేర్కొన్నారు.

దీర్ఘకాలంగా భూములను సాగు చేస్తున్న రైతుల స్వాధీనం, సాగు, భూముల అభివృద్ధి, కుటుంబాల జీవనాధారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా భూములను కేటాయించి పట్టాలు ఇవ్వాలని చాడ వెంకటరెడ్డి కోరారు. సర్వే నంబర్‌ 927కు సంబంధించిన భూసేకరణ, కాలువకు అవసరమైన వాస్తవ విస్తీర్ణం, పరిహారం చెల్లింపులు, మిగిలిన సాగుభూమిపై సమగ్రంగా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే సీలింగ్‌ కేసులను పునఃపరిశీలించి, గతంలో చట్టబద్ధంగా విక్రయించిన లేదా బదలాయించిన భూములను మినహాయించి వాస్తవ మిగులు భూమిని నిర్ధారించాలని కోరారు. దీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న అర్హులైన రైతులకు నామమాత్రపు ధరకు భూములు కేటాయించి, పట్టాలు ఇచ్చేలా సంబంధిత రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని మంత్రిని కోరారు.

వినతిపత్రం అందజేసిన వారిలో రైతులు చాడ శ్రీధర్‌రెడ్డి, పరిపాటి వెంకటరెడ్డి, బావు రవీందర్‌, సుధాకర్‌, రాగుల సంపత్‌రెడ్డి, మిరియాల కనకారెడ్డి, చాడ సతీష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!