Wednesday, October 14, 2026
Homeతెలంగాణశాతవాహన ఇంజినీరింగ్‌ కళాశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకస్మిక తనిఖీ

శాతవాహన ఇంజినీరింగ్‌ కళాశాలలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆకస్మిక తనిఖీ

📰 Generate e-Paper Clip

హుస్నాబాద్‌, సెప్టెంబరు 23 (చైతన్యగళం): హుస్నాబాద్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాలను రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. కళాశాల, వసతి గృహంలోని వసతులను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు తెలిపిన సమస్యలను నమోదు చేసుకుని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

వసతి గృహంలో విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించాలని సూచించారు. సిబ్బందిలో ఒకరు ప్రతిరోజూ విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించాలని ఆదేశించారు. విద్యార్థులతో కమిటీ ఏర్పాటు చేసి భోజనం, వసతులపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన వసతులు, ఆహారం, రవాణా కల్పించడం తన బాధ్యత అని తెలిపారు.

బాలుర వసతి గృహంలోని మరుగుదొడ్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, విద్యార్థులు కోరుతున్న బస్సు, రవాణా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కళాశాల గ్రంథాలయ సమస్యను పరిష్కరించాలని సూచించారు. అవసరమైన క్రీడా సామగ్రిని అందిస్తామని, విద్యార్థులు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొనాలని కోరారు.

విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీలు నిర్వహించాలని అధ్యాపకులకు సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కళాశాలలో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, సైకిళ్లు లేని వారికి సైకిళ్లు అందించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు.

ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన విశ్రాంత ఆచార్యులతో ప్రేరణాత్మక తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కళాశాలలో మెరుగైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

తాను కూడా విద్యార్థి దశలోనే ప్రజా జీవితంలోకి వచ్చానని మంత్రి గుర్తుచేశారు. 1987లో డిగ్రీ కళాశాల అధ్యక్షుడిగా ఎన్నికై విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానం ప్రారంభమైందని తెలిపారు. విద్యార్థి దశలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగితే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చన్నారు.

కార్యక్రమంలో శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి, రిజిస్ట్రార్‌, అధ్యాపకులు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!