అక్కన్నపేట, నవంబర్ 3 (చైతన్యగళం):
అక్కన్నపేట మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని, గౌరవెల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యదర్శి మంద పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని కుందనవానిపల్లి, చౌటకుంట తండా, గౌరవెల్లి గ్రామాల్లో ఎండిపోయిన వరి పంటలను సీపీఐ బృందంతో కలిసి ఆయన పరిశీలించారు. పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంద పవన్ మాట్లాడుతూ పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత రైతులకు పంట నష్టపరిహారం అందించాలని కోరారు. అక్కన్నపేట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని, గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బొడిగెపల్లి గ్రామాన్ని కూడా సందర్శించి పంటల పరిస్థితులను పరిశీలించారు.
