- అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి
- జీఓ 67, 107 ఆధారంగా జర్నలిస్టుల కోసం హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేయాలి: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే
అమరావతి: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జర్నలిస్టుల సమస్యలను ప్రస్తావించిన ఆమె.. ప్రభుత్వ అక్రిడిటేషన్ పొందిన ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
జీఓ నంబర్లు 67, 107 ఆధారంగా జర్నలిస్టుల కోసం ప్రత్యేక హౌసింగ్ కాలనీలు ఏర్పాటు చేసి, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని ఆమె ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తించే క్రమంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నారు.
జర్నలిస్టులకు హెల్త్ కార్డులు
అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు నివాస వసతి కల్పించడంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందేలా హెల్త్ కార్డులు మంజూరు చేయాలని గల్లా మాధవి కోరారు. జర్నలిస్టులు, వారి కుటుంబాలకు వైద్యపరమైన భరోసా కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావించాలని సూచించారు.
ప్రజాస్వామ్యంలో మీడియా కీలకమైన పాత్ర పోషిస్తోందని, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో జర్నలిస్టుల సేవలు ఎంతో ముఖ్యమైనవని ఆమె పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ విధులు నిర్వహిస్తూ ప్రజల గొంతుకగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించేందుకు సమగ్ర విధానం రూపొందించి, ఇళ్ల స్థలాలు, గృహ వసతి, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని గల్లా మాధవి కోరారు.
