Thursday, August 20, 2026
Homeఆంధ్రప్రదేశ్కర్నూలుపాలకులకు భజన చేయడం దేశభక్తి కాదు.. వైఫల్యాలను ప్రశ్నించడమే నిజమైన దేశభక్తి

పాలకులకు భజన చేయడం దేశభక్తి కాదు.. వైఫల్యాలను ప్రశ్నించడమే నిజమైన దేశభక్తి

📰 Generate e-Paper Clip

  • ప్రభుత్వ విధానాలను నిలదీయడం ప్రతి పౌరుడి హక్కు
  • యువత, విద్యార్థులు సంఘటితమై ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించాలి: ఐసా అధ్యక్షురాలు నేహా బోరా

అమరావతి, ఆగస్టు 20 (చైతన్యగళం): దేశభక్తి అంటే పాలకులను పొగడటం, ప్రభుత్వాల తప్పులను గుడ్డిగా సమర్థించడం కాదని.. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధానాలను, ప్రభుత్వ వైఫల్యాలను నిర్భయంగా ప్రశ్నించడమే నిజమైన దేశభక్తి అని ఐసా అధ్యక్షురాలు నేహా బోరా అన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోని లామాకాన్‌, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో దేశ యువత, విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.

ఈ సందర్భంగా నేహా బోరా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉందన్నారు. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తే దేశద్రోహులుగా, ఇతర ముద్రలతో అభివర్ణించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు, విద్యా రంగ పరిరక్షణ కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

విద్యా రంగ పరిరక్షణకు పోరాటం

ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద విద్యా రంగ పరిరక్షణ, పేపర్‌ లీకేజీలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలను ఆమె ప్రస్తావించారు. ఆ సందర్భంగా తమపై పోలీసుల చర్యలు జరిగినప్పటికీ పోరాటం నుంచి వెనక్కి తగ్గలేదన్నారు. ఢిల్లీతో పాటు హైదరాబాద్‌లోనూ విద్యార్థులు, యువత తమకు సంఘీభావం తెలిపారని, ఆ మద్దతు ఉద్యమానికి మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పారు.

విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే విధానాలపై ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, విద్యా వ్యవస్థలో పారదర్శకత, నాణ్యతను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

యువత గొంతును అణచలేరు

ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను ఓటర్లుగా గుర్తించే రాజకీయ ధోరణి మారాలని నేహా బోరా అన్నారు. యువతకు స్వతంత్ర ఆలోచన, ప్రశ్నించే తత్వం ఉండాలని సూచించారు. విద్యార్థుల హక్కులు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల కోసం యువత చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో రోహిత్‌ వేముల ఘటనను ప్రస్తావిస్తూ.. విద్యార్థుల సమస్యలను సున్నితంగా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. విద్యార్థుల ఆకాంక్షలు, హక్కులు, భవిష్యత్తు పట్ల ప్రభుత్వాలు, విద్యాసంస్థలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

ప్రశ్నించడం దేశద్రోహం కాదు

ప్రభుత్వాల విధానాలను ప్రశ్నించేవారిపై వివిధ రకాల ముద్రలు వేయడం సరైన పద్ధతి కాదని నేహా బోరా అన్నారు. దేశంలో నెలకొన్న అసమానతలు, సామాజిక సమస్యలు, ప్రజల ఇబ్బందులను ఎత్తిచూపడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించేందుకు ప్రజలు, విద్యార్థులు, యువత చైతన్యంతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

దేశంలో మత, సామాజిక విభజనలకు దారితీసే రాజకీయాలను వ్యతిరేకించాలని, అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యతను కాపాడాలని అన్నారు. దేశ వైవిధ్యం, లౌకిక ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు.

మూడు సూత్రాలతో యువత ముందుకు

దేశ యువత, విద్యార్థులు ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టాలని నేహా బోరా సూచించారు. మొదటగా చదువుకోవాలి.. దేశ వ్యవస్థ, చరిత్ర, రాజకీయ పరిణామాలను లోతుగా అర్థం చేసుకోవాలి. రెండోది ఐక్యంగా సంఘటితం కావాలి.. తమ హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సమష్టిగా పనిచేయాలి. మూడోది ప్రజా సమస్యలపై గళమెత్తాలి.. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు నష్టం కలిగితే ప్రశ్నించాలి అని పిలుపునిచ్చారు.

సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం లేదా మద్దతు ప్రకటించడం మాత్రమే సరిపోదని.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలో చైతన్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

నాణ్యమైన విద్య, ఉపాధి కల్పించాలి

దేశంలోని ప్రతి పేద విద్యార్థికీ నాణ్యమైన, అందుబాటులో ఉండే విద్య లభించే వరకు, ప్రతి యువకుడికి ఉపాధి అవకాశాలు కల్పించే వరకు పోరాటం కొనసాగాలని నేహా బోరా అన్నారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలను బలోపేతం చేయడం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ప్రజా సమస్యలపై జరిగే ఉద్యమాలు ఒక్క వ్యక్తి లేదా ఒక ఎన్నికతో ముగిసేవి కావని.. సామాజిక మార్పు కోసం నిరంతర చైతన్యం అవసరమని పేర్కొన్నారు. యువత ఐక్యంగా ముందుకు సాగితే ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు మరింత బలం చేకూరుతుందని అన్నారు.

కార్యక్రమం ముగింపులో “ఇంక్విలాబ్‌ జిందాబాద్‌.. విద్యార్థి ఐక్యత వర్ధిల్లాలి” అంటూ నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!