తుక్కుగూడ, సెప్టెంబర్ 9 (చైతన్యగళం): మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని వనస్థలిపురం సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, వసతి గృహంలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పేరెంట్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. తుక్కుగూడలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమస్యలను వివరించారు.
ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులకు సరిపడా మౌలిక వసతులు లేవని సభ్యులు తెలిపారు. వసతి గృహ భవనం అనుకూలంగా లేదని, సురక్షితమైన విశాలమైన భవనానికి మార్చాలని కోరారు. తరగతి గదుల్లో తగినన్ని బెంచీలు, ఫర్నిచర్ లేకపోవడంతో పాటు వసతి గృహంలో సరిపడా పడకలు, బెడ్‌కాట్లు, లైట్లు, ఫ్యాన్లు లేవని పేర్కొన్నారు. దోమల బెడదతో విద్యార్థినుల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాలకు పూర్తిస్థాయి ప్రిన్సిపాల్‌తో పాటు బోధనేతర సిబ్బంది, సంరక్షకులు, భద్రతా సిబ్బందిని నియమించాలని కోరారు. విద్యార్థినుల భద్రత, ఆరోగ్యం, విద్యాభ్యాసానికి అవసరమైన తాగునీరు, బెంచీలు, పడకలు, ఫ్యాన్లు, లైట్లు తదితర సదుపాయాలు వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సమస్యలను విన్న లక్ష్మారెడ్డి వెంటనే సంబంధిత విద్యాశాఖ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
