Saturday, August 29, 2026
Homeసంపాదకీయంఎల్ నినో ప్రభావంపై అప్రమత్తం-ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి

ఎల్ నినో ప్రభావంపై అప్రమత్తం-ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి

📰 Generate e-Paper Clip

సమీక్ష సమావేశంలో ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

సిద్దిపేట, జూలై 18 (చైతన్యగళం):
వానాకాలం–2026లో ఎల్ నినో ప్రభావం కారణంగా భవిష్యత్తులో భూగర్భ జలాలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. శనివారం సిద్దిపేట ఐడీఓసీ సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ శాఖలు, ప్రత్యేక అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే ఆయిల్ పామ్, కంది, రాగి, సజ్జ వంటి పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుపై రైతులకు విస్తృత అవగాహన కల్పించి, ప్రతి గ్రామం నుంచి కనీసం ముగ్గురు రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

నీటి వృథాను నివారించడం, భూగర్భ జలాల సంరక్షణ, ఫార్మ్ పాండ్లు, ఇంకుడు గుంతల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టి వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో రాబోయే రెండేళ్లకు సరిపడా ధాన్యం నిల్వలు ఉన్నాయని తెలిపారు.

టామ్‌కామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా ద్వారా జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, జిల్లాలో 100 మంది నిరుద్యోగ యువత నమోదు చేసుకుంటే సిద్దిపేటలోనే జర్మన్ భాష శిక్షణ ఇచ్చి విదేశీ ఉపాధికి అవకాశం కల్పిస్తామని మంత్రి ప్రకటించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్, జూలై నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, ప్రస్తుతం జిల్లాలో తాగునీటి సమస్య లేదని, రానున్న మూడు రోజుల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపెల్లి చంద్రం, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీవోలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install CG News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!