సిద్దిపేట, ఆగస్టు 6 (చైతన్యగళం):
సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రూ.5.49 కోట్ల విలువైన అత్యాధునిక వైద్య పరికరాల కొనుగోలుకు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఆమోదం తెలిపింది. గురువారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధ్యక్షతన జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది వివరాలు సమగ్రంగా అందించడంలో విఫలమైన జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో పాటు సంబంధిత అధికారులపై మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి వెంటనే ప్రతిపాదనలు పంపాలని, అవసరమైన అదనపు నిధుల కోసం సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్యాలియేటివ్ కేర్ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, ఆర్‌బీఎస్‌కే ద్వారా విద్యార్థులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.అనవసర సీ-సెక్షన్ ప్రసవాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, రోగులకు నాణ్యమైన ఆహారం అందేలా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అన్ని ఆధునిక వైద్య పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రిఫర్ చేసే రోగులను ప్రభుత్వ అంబులెన్స్‌ల ద్వారానే తరలించాలని సూచించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యులు క్రమం తప్పకుండా విధులకు హాజరై ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. కీమోథెరపీ, ప్యాలియేటివ్ కేర్, పిల్లల వైద్య సేవలు, సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ తదితర సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని సూచించారు. గర్భిణులకు టిఫా స్కాన్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. సమావేశానికి ముందు తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంగీత షా, డీఎంహెచ్‌వో డాక్టర్ ధనరాజ్, వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు.
